Akshara Darshini
Date of Publish : 26/10/2026, 4:46 pm
Published by Kadiyala Chinmaya Reddy

ధర్మం, సత్యం, నీతి మార్గాలను బోధించే మహాకావ్యం రామాయణం

  • మహర్షి వాల్మీకి జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయం
  • జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా

నెల్లూరు,(అక్షర దర్శిని): భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ధర్మం, సత్యం, నీతి, కరుణ వంటి ఉన్నతమైన విలువలను ప్రపంచానికి చాటిచెప్పిన మహాకావ్యం రామాయణమని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. ఆదికవి మహర్షి వాల్మీకి జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.

సోమవారం నెల్లూరు కలెక్టరేట్‌లోని ఎస్‌.ఆర్‌. శంకరన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో నిర్వహించిన మహర్షి వాల్మీకి జయంతి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. తొలుత మహర్షి వాల్మీకి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రామాయణం కేవలం ఒక ఇతిహాసం మాత్రమే కాదని, మానవ జీవితానికి మార్గదర్శకంగా నిలిచే ధర్మబోధనల సమాహారమని వివరించారు. కుటుంబ సంబంధాలు, సామాజిక బాధ్యతలు, సత్యనిష్ఠ, కర్తవ్యపాలన, కరుణ వంటి మానవీయ విలువలను రామాయణం ద్వారా మహర్షి వాల్మీకి ప్రపంచానికి అందించారని తెలిపారు.వాల్మీకి మహర్షి రచించిన రామాయణం తరతరాలుగా ప్రజలకు స్ఫూర్తినిస్తూ, సమాజానికి నైతిక మార్గదర్శకత్వం వహిస్తోందని అన్నారు. జీవితంలో మార్పు సాధించడం ద్వారా ఉన్నతమైన లక్ష్యాలను చేరుకోవచ్చనే సందేశాన్ని మహర్షి వాల్మీకి జీవన ప్రస్థానం అందిస్తుందని పేర్కొన్నారు.మహర్షి బోధించిన సత్యం, ధర్మం, మానవీయ విలువలను ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఆచరించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి విజయకుమార్‌, సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Akshara Darshini.
PDF Share Save