Akshara Darshini
Date of Publish : 27/10/2026, 5:32 pm
Published by Kadiyala Chinmaya Reddy

వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించండి

  • 59వ డివిజన్‌లో ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

నెల్లూరు,(అక్షర దర్శిని):

నెల్లూరు నగరాభివృద్ధి కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు డాక్టర్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నెల్లూరు నగరంలోని 59వ డివిజన్‌లో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ అభ్యర్థి కిషన్, మేయర్ అభ్యర్థి ఆనం విజయ్‌కుమార్‌రెడ్డికి మద్దతుగా మంగళవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. శాసనమండలి సభ్యుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసులు, ఇతర పార్టీ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. అంతకుముందు శ్రీరామ మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు.

కూటమి పాలనపై విమర్శలు

ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో దాడులు, దౌర్జన్యాలు పెరిగాయని, నిత్యావసర వస్తువుల ధరలు సామాన్య ప్రజలకు భారంగా మారాయని విమర్శించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ధరలు, ప్రస్తుతం ఉన్న ధరలను ప్రజలు బేరీజు వేసుకోవాలని సూచించారు.మున్సిపల్ శాఖ మంత్రి నారాయణపై విమర్శలు గుప్పిస్తూ పన్నుల పేరుతో ప్రజలపై భారం మోపుతున్నారని, చెట్లు, చెత్త పేరుతో వసూలు చేసిన నిధులను నగరాభివృద్ధికి వినియోగించడం లేదని ఆరోపించారు. నెల్లూరు నగర ప్రజల అభివృద్ధి, సంక్షేమంపై పాలకులు తగిన శ్రద్ధ చూపడం లేదని అన్నారు.

ఆనం కుటుంబానికి నగర సేవల అనుభవం

నెల్లూరు నగరానికి ఆనం కుటుంబం అనేక తరాలుగా సేవలందించిందని కాకాణి పేర్కొన్నారు. అనుభవజ్ఞుడైన ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, ప్రజలు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఆయనతో పాటు 59వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి కిషన్‌ను గెలిపించాలని కోరారు. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లందరినీ గెలిపించి మంచి బృందాన్ని అందిస్తే విజయ్‌కుమార్‌రెడ్డి నాయకత్వంలో నెల్లూరు నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపించవచ్చని అన్నారు.

పోలీసుల తీరుపై ఆరోపణలు

జిల్లాలో కొందరు పోలీసు అధికారులు తమ విధులను పక్కనపెట్టి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కాకాణి ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ నాయకులను పోటీ నుంచి తప్పుకోవాలని బెదిరిస్తూ, సీట్ల విషయంలో బేరసారాలు చేస్తున్నారంటూ విమర్శించారు. పోలీసు అధికారులు శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా విధులు నిర్వహించాలని సూచించారు.

వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను బెదిరించడం, వ్యాపారులను, స్థానిక నాయకులను ఒత్తిడికి గురిచేయడం, నామినేషన్లను తిరస్కరించేలా ప్రయత్నించడం వంటి చర్యలతో ఏకగ్రీవాలు సాధించాలని అధికార పక్షం చూస్తోందని ఆరోపించారు. అధికార బలంతో కాకుండా ప్రజల ఓట్లతోనే ఎన్నికల్లో గెలవాలని అధికార కూటమికి హితవు పలికారు.

స్వేచ్ఛాయుత ఎన్నికలు నిర్వహించాలి

కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని కాకాణి అన్నారు. నెల్లూరు నగరంలో వ్యాపార వర్గాలు, ఆర్యవైశ్యుల సంక్షేమం గురించి ఆలోచించి సేవలందించిన కుటుంబాల్లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుటుంబం, ఆనం కుటుంబం ఉన్నాయని పేర్కొన్నారు.ఎన్నికల్లో బెదిరింపులు, ప్రలోభాలు, బ్లాక్‌మెయిలింగ్‌కు లొంగకుండా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీని కోరినట్లు తెలిపారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Akshara Darshini.
PDF Share Save