Akshara Darshini
Date of Publish : 27/10/2026, 7:56 pm
Published by shafi

దారుణంగా రోడ్డులు.

  • కలువాయి మార్గంలో ప్రమాదకరంగా మారిన రహదారి.. భారీ గుంతతో వాహనదారుల అవస్థలు
  • కండాపురం వద్ద రోడ్డుపై భారీ రంధ్రం.. తాటిమట్టలు, కర్రలతో హెచ్చరికలు.
  • రోజుకో ప్రమాదం.

నెల్లూరు జిల్లా కలువాయి మండలం చింతలాత్మకూరు గ్రామం నుంచి కలువాయి వెళ్లే ప్రధాన మార్గంలో కండాపురం వద్ద రహదారి పూర్తిగా దెబ్బతిని ప్రమాదభరితంగా మారింది. రోడ్డు మధ్యలో భారీ గుంత ఏర్పడటంతో అటుగా ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో ఈ గుంతను గుర్తించడం కష్టంగా మారడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాద తీవ్రతను గుర్తించిన వాహనదారులు, గుంత వద్ద తాటిమట్టలు, కర్రలు ఏర్పాటు చేసి ఇతర వాహనదారులను అప్రమత్తం చేస్తున్నారు. అయితే, ప్రధాన రహదారిపై ఇటువంటి పరిస్థితి నెలకొనడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని స్థానికులు విమర్శిస్తున్నారు.

గత ప్రభుత్వ హయాంలో ఈ రహదారి దుస్థితిపై కూటమి నాయకులు తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన విషయాన్ని గ్రామస్తులు గుర్తుచేస్తున్నారు. అప్పట్లో రహదారుల పరిస్థితిని ప్రశ్నించిన నాయకులు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఈ మార్గానికి మరమ్మతులు చేపట్టకపోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారుల అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, కండాపురం వద్ద రహదారి పరిస్థితి మాత్రం రోజురోజుకూ మరింత దారుణంగా తయారవుతోందని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ మార్గంలో గతంలోనూ పలుమార్లు ప్రమాదాలు చోటుచేసుకున్నాయని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

ఇదిలా ఉండగా, గతంలో ఈ రహదారి సమస్యపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచనల మేరకు జనసేన యువత ఆందోళన చేపట్టి ధర్నా నిర్వహించినట్లు స్థానికులు గుర్తుచేస్తున్నారు. అప్పట్లో రహదారి దుస్థితిపై నిరసన తెలిపిన జనసేన నాయకులు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. స్థానిక కూటమి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తక్షణ చర్యలు చేపట్టేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. భారీ గుంత కారణంగా మరో ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని, వాహనదారులు, గ్రామస్తుల ఇబ్బందులను తొలగించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Akshara Darshini.
PDF Share Save