తోటపల్లిగూడూరు,(అక్షర దర్శిని):
అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన అజెండా అని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపిస్తే గ్రామాల అభివృద్ధికి మరింత బాటలు పడతాయని అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తనకు లభించిన మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీని స్థానిక సంస్థల ఎన్నికల్లో అందించాలని ప్రజలను కోరారు. బుధవారం తోటపల్లిగూడూరు మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని కూటమి అభ్యర్థులకు మద్దతుగా మాట్లాడారు.
తోటపల్లిగూడూరు తన సొంత మండలమని, తన బంధువర్గం అంతా ఇక్కడే ఉందని సోమిరెడ్డి తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో అవినీతి, అక్రమాలు, అరాచకాలు చోటుచేసుకున్నాయని, ప్రభుత్వ భూములతో పాటు దళితులు, గిరిజనుల భూములు, పాఠశాలలు, ఆలయాలకు సంబంధించిన భూములకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. గతంలో అధికారంలో ఉండి భూదోపిడీకి పాల్పడిన వారు ప్రస్తుతం తమపై విమర్శలు చేయడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. అలాంటి వారికి ప్రజలు ఓటు ద్వారా గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
పేదలకు భూయాజమాన్య హక్కులు కల్పించాం
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో జిల్లాలో 70 వేల ఎకరాలకు పైగా సీజేఎఫ్‌ఎస్ భూములను డీకేటీ పట్టాలుగా మార్చి పేదలకు అందించామని సోమిరెడ్డి వివరించారు. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశామని తెలిపారు. పట్టాల ద్వారా రైతులకు భూములపై హక్కులు లభించడంతో పాటు వాటి విలువ పెరిగి పేద కుటుంబాలకు ప్రయోజనం కలిగిందన్నారు.సర్వేపల్లి నియోజకవర్గంలో సుమారు 7 వేల ఎకరాలకు సంబంధించి డీకేటీ పట్టాలు అందించామని, తోటపల్లిగూడూరు మండలంలో 1,077 మంది రైతులకు 761 ఎకరాలకు పట్టాలు మంజూరు చేశామని పేర్కొన్నారు. పేదలకు మేలు చేసేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే, వైసీపీ పాలనలో పలు ప్రాంతాల్లో దళితులు, గిరిజనులకు చెందిన భూములతో పాటు పాఠశాల భూములను ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలకు సంబంధించిన అంశాలపై ప్రజలు ఆలోచించి ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలని కోరారు.
కూటమి ప్రభుత్వంతో సంక్షేమ పథకాలు
కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని సోమిరెడ్డి అన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, తల్లికి వందనం, స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం, దీపం పథకం కింద ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ల పంపిణీ వంటి పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి చేకూరుతోందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి అందించే నిధులను స్థానిక సంస్థలకే పూర్తిస్థాయిలో వినియోగించేలా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కార్యాచరణ చేపడుతున్నారని తెలిపారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశీస్సులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ సమష్టి కృషితో రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నారని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు, స్థానిక సంస్థల బలోపేతానికి కూటమి అభ్యర్థుల గెలుపు దోహదపడుతుందని చెప్పారు.
అవినీతికి ఓటుతో సమాధానం చెప్పాలి
వైసీపీ ప్రభుత్వ హయాంలో సాగునీటి శాఖలో పనులు పూర్తికాకుండానే భారీ మొత్తంలో బిల్లులు చెల్లించారని, కాలువలు, చెరువులకు షట్టర్లు ఏర్పాటు చేయకుండానే రూ.7 కోట్లకు పైగా బిల్లులు పొందారని సోమిరెడ్డి ఆరోపించారు. ఈ ఆరోపణలపై సంబంధిత అధికారులు పరిశీలన జరపాలని పేర్కొంటూ, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారిని ప్రజలు ప్రశ్నించాలని అన్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన సమాధానం చెప్పాలని కోరారు.
కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం
తోటపల్లిగూడూరు మండలంలో జెడ్పీటీసీ అభ్యర్థి జానా రజని, వరిగొండ ఎంపీటీసీ అభ్యర్థులు పేరం శోభారాణి, జానా జగదీష్, తోటపల్లిగూడూరు అభ్యర్థి మన్నెం విమల, పోట్లపూడి–విలుకానిపల్లి అభ్యర్థి గళ్లా ప్రవళ్లిక, పాపిరెడ్డిపాళెం–ఇస్కపాళెం అభ్యర్థి ఇంగిలాల నిర్మలమ్మను గెలిపించాలని సోమిరెడ్డి ఆయా గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి కూటమి అభ్యర్థులను గెలిపించాలని, అభివృద్ధి, సంక్షేమానికి ప్రజలు అండగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


