పొదలకూరు,అక్షర దర్శిని: అభివృద్ధి చేశాం.. మరింత అభివృద్ధి చేసేందుకు ఆదరించి గెలిపించాలని టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి కలిచేటి ప్రభాకర్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం పొదలకూరులోని టీపీ నగర్, కాకుమాని లేఅవుట్, శ్రీనివాస నగర్ ప్రాంతాల్లో టీడీపీ అభ్యర్థులు ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. జడ్పీటీసీ అభ్యర్థి కలిచేటి ప్రభాకర్‌రెడ్డి, బిట్-1 ఎంపీటీసీ అభ్యర్థి ఆదాల సుగుణ, బిట్-3 అభ్యర్థి ఖాదర్‌బాషా ఇంటింటికీ వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ సందర్భంగా ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. గతంలో చేపట్టిన అభివృద్ధిని చూసి ప్రజలు మరోసారి టీడీపీకి అండగా నిలవాలని కోరారు.
స్థానిక సంస్థల్లోనూ సైకిల్ జోరు కొనసాగాలి..
గ్రామాల సమగ్రాభివృద్ధి సాధించాలంటే స్థానిక సంస్థల్లోనూ టీడీపీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని ప్రతి గ్రామంలో రహదారులు, డ్రైనేజీలు, తాగునీరు, వీధిదీపాలు తదితర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడమే తమ లక్ష్యమన్నారు. పొదలకూరు మండలంలోని అన్ని ఎంపీటీసీ స్థానాలతో పాటు జడ్పీటీసీ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకునేలా ప్రజలు ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి కొనసాగాలంటే సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు.ప్రచారంలో భాగంగా అభ్యర్థులు స్థానికులతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు షేక్ జమీర్, ఆదాల మురళి, ఆశీర్వాదం తదితరులతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.