నెల్లూరు జిల్లా, కలువాయి: పిచ్చికుక్క స్వైరవిహారంతో బ్రాహ్మణపల్లి గ్రామ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఒకే రోజు ఏకంగా 16 మందిని కరిచి గాయపరచడంతో గ్రామంలో కలకలం రేగింది. చిన్నా, పెద్దా తేడా లేకుండా కుక్క దాడి చేయడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
కుక్క కాట్లకు గురైన వారిలో పలువురికి గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం పొదలకూరులోని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఒక్కరోజే ఇంతమందిపై పిచ్చికుక్క దాడి చేయడంతో గ్రామస్థులు అప్రమత్తమయ్యారు.
గ్రామంలో పిచ్చికుక్కల సంచారాన్ని అరికట్టేందుకు సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజలు, ముఖ్యంగా చిన్నపిల్లలు బయటకు వెళ్లే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు స్పందించి ప్రజలకు రక్షణ కల్పించాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.


