నెల్లూరు జిల్లా కలువాయి మండలం మాదనగారిపల్లి నుంచి కుల్లూరుకు వెళ్లే పాత రహదారిపై ప్రమాదకరంగా మారిన చిన్న బ్రిడ్జిపై అక్షర దర్శిని పత్రికలో ప్రచురితమైన కథనానికి సంబంధిత అధికారులు స్పందించారు. బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకుని ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి నెలకొందని, నిత్యం ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలు, వాహనదారులకు ప్రమాదం పొంచి ఉందని అక్షర దర్శిని వెలుగులోకి తెచ్చింది. ఈ కథనంపై స్పందించిన అధికారులు వెంటనే బ్రిడ్జి వద్దకు చేరుకుని తాత్కాలిక మరమ్మతు పనులు చేపట్టారు. దీంతో స్థానికులు కొంత ఊరట వ్యక్తం చేస్తున్నారు. అయితే తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టకుండా బ్రిడ్జి పరిస్థితిని పూర్తిస్థాయిలో పరిశీలించి, భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో అక్షర దర్శిని కథనం మరోసారి కీలక పాత్ర పోషించిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.


