పొదలకూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతోనే పోలీసులు, నోటీసులను అడ్డుపెట్టుకుని కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆరోపించారు. అక్రమ కేసులు, అరెస్టులు, పోలీసు నోటీసులతో తమను భయపెట్టాలని చూస్తే వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.పొదలకూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో వాకాటి శ్రీనివాసులరెడ్డి, బిట్–2 ఎంపీటీసీ అభ్యర్థి వాకాటి సంధ్య, వాకాటి శివారెడ్డి, అంజాద్ తదితరులు మాట్లాడారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న సమయంలోనే తమ కుటుంబానికి నోటీసులు, కేసుల పేరుతో ఇబ్బందులు కలిగిస్తున్నారని వాకాటి శ్రీనివాసులరెడ్డి ఆరోపించారు. గతంలోనూ తమ కుటుంబం అనేక ఇబ్బందులు ఎదుర్కొందని, అయినా ప్రజల కోసం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.
రుస్తుం మైన్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని వాకాటి శివారెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో తాము ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కూడా ప్రమాణానికి సిద్ధమా అని ప్రశ్నించారు. నిరాధార ఆరోపణలతో తమను రాజకీయంగా దెబ్బతీయాలని చూస్తున్నారని మండిపడ్డారు.
వైఎస్సార్‌సీపీ నాయకుడు అంజాద్ మాట్లాడుతూ పోలీసులను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయకుండా ప్రజల మధ్య ఎన్నికల్లో తేల్చుకోవాలని సవాల్ చేశారు. ఎన్ని కేసులు, నోటీసులు వచ్చినా భయపడేది లేదని, ప్రజాబలంతోనే ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.