Akshara Darshini
Date of Publish : 01/11/2026, 7:49 am
Published by Kadiyala Chinmaya Reddy

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న చంద్రబాబు: కాకాణి

  • నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం దుర్మార్గం.. పోలీసులతో బెదిరింపులు సరికాదు
  • చిట్టమూరులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం

చిట్టమూరు,(అక్షర దర్శిని):

 స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకునేందుకు పోలీసుల ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. కూటమి ప్రభుత్వ తీరు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు.

తిరుపతి జిల్లా చిట్టమూరులో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో శనివారం నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త గురవయ్యతో కలిసి కాకాణి పాల్గొన్నారు. చిట్టమూరు జెడ్పీటీసీ అభ్యర్థి సనారెడ్డి విజయలక్ష్మితో పాటు 12 మంది ఎంపీటీసీ అభ్యర్థులను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.

ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ.. నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై దాడులు చేయడం, మహిళా అభ్యర్థులను అవమానించడం, పోలీసుల ద్వారా బెదిరింపులకు పాల్పడటం వంటి ఘటనలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు. గూడూరు నియోజకవర్గంలో మహిళా అభ్యర్థులపై దాడులు చేసి, చీరలు చించివేయడంతో పాటు అసభ్యంగా మాట్లాడినట్లు ఆరోపణలు రావడం ఆందోళనకరమని పేర్కొన్నారు.

నామినేషన్లు వేస్తే అరెస్టు చేసి జైలుకు పంపిస్తామని పోలీసులు బెదిరిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. గూడూరు ప్రాంతానికి చెందిన అట్ల శ్రీనివాసులు వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ, అక్రమంగా మద్యం ఉన్నట్లు చూపించి కేసు నమోదు చేశారని విమర్శించారు. సరైన ఆధారాలు లేకుండానే కేసులు నమోదు చేసి ప్రత్యర్థి పార్టీ నాయకులు, కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.పోలీసులను అడ్డుపెట్టుకుని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను ఎన్నికల ప్రచారానికి దూరం చేయాలనే ప్రయత్నాలు ఫలించవని కాకాణి అన్నారు. చంద్రబాబు నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ, పోలీసు వ్యవస్థపై ఇలాంటి ఆరోపణలు రావడం విచారకరమని వ్యాఖ్యానించారు. ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం, ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే అవకాశం కల్పించాలని సూచించారు. ఎన్నికల్లో గెలుపోటములను ప్రజలే నిర్ణయిస్తారని, ప్రత్యర్థి అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం సరైన పద్ధతి కాదన్నారు.దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజలకు అందించిన సేవలను ప్రజలు ఇప్పటికీ గుర్తుంచుకుంటున్నారని కాకాణి పేర్కొన్నారు. నాయకుల పనితీరు, ప్రజలకు చేసిన సేవలే వారి రాజకీయ చరిత్రను నిర్ణయిస్తాయని అన్నారు. తమ పార్టీకి చెందిన ఒక తరం మాత్రమే కాకుండా, రాబోయే తరాలు కూడా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

ఆధారాలు భద్రపరచుకోవాలి

పోలీసుల చర్యలకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు, ఫిర్యాదులు, ఎఫ్‌ఐఆర్‌ల వంటి ఆధారాలను భద్రపరచుకోవాలని పార్టీ శ్రేణులకు కాకాణి సూచించారు. అక్రమ కేసులు, బెదిరింపులకు బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకునేలా పోరాడతామని, బాధ్యులైన వారిలో ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు.

స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని, ప్రతి అభ్యర్థికి నామినేషన్ దాఖలు చేసే హక్కుతో పాటు స్వేచ్ఛగా ప్రచారం చేసుకునే అవకాశం ఉండాలని ఆయన స్పష్టం చేశారు. చిట్టమూరు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Akshara Darshini.
PDF Share Save