నెల్లూరు జిల్లా కలువాయి మండలం కుల్లూరు సెగ్మెంట్‌లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఎంపీటీసీ అభ్యర్థి చింతల రవీంద్ర ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్లను కలుసుకుంటూ బహుజనుల అభ్యున్నతి, రాజ్యాధికార సాధన కోసం బీఎస్పీకి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఏడీపీఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నిజమాల ప్రసాద్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బహుజనులు రాజ్యాధికారం సాధించాలని కలలు కన్నారని, ఆ మహనీయుడి ఆశయాలను నిజం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచినా మన దేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే కొనసాగుతోందని, సమాజంలోని అణగారిన వర్గాలకు రాజకీయ అధికారం దక్కి, పాలనలో భాగస్వాములు అయినప్పుడే దేశం నిజమైన అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని పేర్కొన్నారు. బహుజనులకు రాజకీయ ప్రాతినిధ్యం, సమాన హక్కులు, సామాజిక న్యాయం దక్కాలంటే ప్రతి ఒక్కరూ చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కుల్లూరు సెగ్మెంట్ బీఎస్పీ అభ్యర్థి చింతల రవీంద్రను గెలిపించి బహుజనుల రాజ్యాధికార సాధనకు మద్దతు తెలపాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

