Akshara Darshini
Date of Publish : 01/11/2026, 5:38 pm
Published by Kadiyala Chinmaya Reddy

అల్లీపురంలో ఓటు హక్కు వినియోగించుకున్న సోమిరెడ్డి

  • ప్రజలంతా బాధ్యతగా ఓటు వేయాలి.. ప్రశాంతంగా పోలింగ్‌ జరగడం సంతోషదాయకం
  • వైసీపీ హయాంలో జరిగిన దౌర్జన్యాలు, దాడులు ఇప్పుడు లేవు

నెల్లూరు(అక్షర దర్శిని):

నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో భాగంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆదివారం అల్లీపురంలోని 5వ డివిజన్‌ పీకేజీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలందరూ బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

ప్రశాంత వాతావరణంలో పోలింగ్‌ ప్రక్రియ కొనసాగుతుండటం సంతోషకరమని సోమిరెడ్డి పేర్కొన్నారు. వైసీపీ నేతలు ఎన్నికల సందర్భంగా చేసిన హడావుడికి భిన్నంగా ప్రజలు ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినట్లు దౌర్జన్యాలు, దాడులు, అరాచకాలు ప్రస్తుతం కనిపించడం లేదని విమర్శించారు.

ఏకగ్రీవాలపై వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ సోమిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఏకగ్రీవాలు జరిగితే ఎమ్మెల్యే సీట్లు ఇవ్వబోమంటూ వైసీపీ నేతలను హెచ్చరించిన జగన్‌.. ఇప్పుడు ఏకగ్రీవాలు జరిగిన నేపథ్యంలో ఎలాంటి వైఖరి తీసుకుంటారో చూడాలని అన్నారు.

పులివెందులలో మెజారిటీ స్థానాలు ఏకగ్రీవమైన నేపథ్యంలో జగన్‌కు ఎమ్మెల్యే సీటు దక్కుతుందా లేదా అన్నది తేలాల్సి ఉందంటూ సోమిరెడ్డి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Akshara Darshini.
PDF Share Save