Akshara Darshini
Date of Publish : 02/11/2026, 8:39 pm
Published by Kadiyala Chinmaya Reddy

పార్కు స్థలాన్ని ఆక్రమించిన వ్యక్తికి టీడీపీ టికెట్ ఇచ్చారు...

  • పార్కు స్థలాన్ని ప్లాట్లుగా మార్చి అమ్మకానికి పెట్టిన వ్యక్తి నన్ను సంప్రదించాలని చూస్తే తిరస్కరించా..
  • గతంలో కబ్జా ఆరోపణలపై కేసులు పెట్టించిన సోమిరెడ్డే.. ఇప్పుడు అదే వ్యక్తిని పార్టీలో చేర్చుకుని పోటీలో నిలబెట్టారు..
  • కాకాణి సంచలన వ్యాఖ్యలు

పొదలకూరు,(అక్షర దర్శిని): 

ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించిన పార్కు స్థలాన్ని ఆక్రమించి, ప్లాట్లుగా మార్చి విక్రయానికి పెట్టిన వ్యక్తిని తెలుగుదేశం పార్టీలో చేర్చుకుని ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీలో నిలబెట్టారని మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. గతంలో ఇదే వ్యక్తిపై కబ్జా ఆరోపణలతో కేసులు పెట్టించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం అదే వ్యక్తిని పార్టీలో చేర్చుకుని ఎన్నికల బరిలో నిలబెట్టడం ఏమిటని ప్రశ్నించారు. సోమవారం పొదలకూరులో మీడియాతో మాట్లాడిన కాకాణి.. పార్కు స్థలాల ఆక్రమణ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ సోమిరెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.పొదలకూరులో ప్రజా అవసరాల కోసం కేటాయించిన పార్కు స్థలాన్ని ఆక్రమించి, ప్లాట్లుగా విక్రయించేందుకు ప్రయత్నించిన వ్యక్తికి టీడీపీ తరఫున ఎంపీటీసీ టికెట్ ఇవ్వడమంటే కబ్జాకోరులను ప్రోత్సహించడమేనని కాకాణి వ్యాఖ్యానించారు. గతంలో ఆ వ్యక్తి కబ్జాలకు పాల్పడ్డాడని కేసులు పెట్టించిన నువ్వే.. ఇప్పుడు అతడిని నీ పార్టీలోకి తీసుకొచ్చి ఎన్నికల్లో పోటీకి నిలబెట్టావంటూ సోమిరెడ్డిని నిలదీశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు సరైన అభ్యర్థులు దొరకక కబ్జాకోరులను వెతికి మరీ బరిలోకి దించాల్సిన దుస్థితి వచ్చిందని విమర్శించారు.

నన్ను కలవాలని ప్రయత్నిస్తే తిరస్కరించా

పార్కు స్థలాన్ని ఆక్రమించి ప్లాట్లు అమ్మకానికి పెట్టిన వ్యక్తి నామినేషన్లకు ముందు తనను సంప్రదించాలని చూస్తే తాను తిరస్కరించానన్నారు. టీడీపీ నాయకులు తనను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని, తనను మీరు దగ్గరకు తీస్తే టీడీపీలోకి వెళ్లనని సదరు వ్యక్తి చెప్పినట్లు తెలిపారు. ఈ విషయంపై తోడేరు మాజీ సర్పంచ్ ఏనుగు శశిధర్ రెడ్డి ద్వారా రాయబారం కూడా పంపించారని పేర్కొన్నారు. కబ్జాకోరులు తమకు అవసరం లేదని తాను స్పష్టం చేసినట్లు చెప్పారు. ప్రజల కోసం కేటాయించిన పార్కు స్థలాన్ని ఆక్రమించి విక్రయానికి పెట్టిన వారిని ప్రోత్సహించేది లేదని వ్యాఖ్యానించారు.

అభ్యర్థుల చరిత్ర తెలుసుకుని మాట్లాడాలి..

సర్వేపల్లిలో వైసీపీ అభ్యర్థుల గురించి విమర్శలు చేసే ముందు తాను నిలబెట్టిన అభ్యర్థుల చరిత్ర ఏమిటో తెలుసుకోవాలని సోమిరెడ్డికి కాకాణి హితవు పలికారు. వాకాటి శ్రీనివాసులు రెడ్ది, చిన్ని గురించి మాట్లాడే ముందు తన రాజకీయ, వ్యక్తిగత నేపథ్యం ఏమిటో తెలుసుకుని మాట్లాడాలని అన్నారు. గ్రామాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు కుటుంబ నేపథ్యాలపై విమర్శలు చేయడం కాకుండా అభివృద్ధి, సంక్షేమం గురించి మాట్లాడాలని సూచించారు.లేఅవుట్ల యజమానుల దగ్గర డబ్బులు తీసుకోవడం తప్ప సోమిరెడ్డి పొదలకూరుకు చేసిందేమీ లేదని ఆరోపించారు. తాను గతంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తెలుసని, ప్రజలు తమను ఆదరిస్తారన్న నమ్మకం ఉందని చెప్పారు. అన్ని స్థానాల్లో వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తున్నారని, ఎన్నికల్లో తమకు విజయం లభిస్తుందని కాకాణి ఆశాభావం వ్యక్తం చేశారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Akshara Darshini.
PDF Share Save