26/10/2026, Monday · 12:47:37 PM About UsPrivacy PolicyContact Us
Akshara Darshini

నెల్లూరులో కూటమి నేతల కీలక భేటీ

Kadiyala Chinmaya Reddy 26/10/2026 11:13 AM శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 2

నెల్లూరులో కూటమి నేతల కీలక భేటీ
Want this news as a newspaper clip?Print News Clip
  • విభేదాలపై ఫేక్ ప్రచారాలకు చెక్‌.. ఐక్యంగా ఎన్నికల బరిలోకి!
  • నగర అభివృద్ధే లక్ష్యం.. మేయర్ పీఠం కూటమిదేనని నేతల ధీమా

నెల్లూరు,(అక్షర దర్శిని):నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నివాసంలో కూటమి పార్టీలకు చెందిన ముఖ్య నేతలు కీలక సమావేశం నిర్వహించారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, నెల్లూరు మేయర్ అభ్యర్థి రూప్‌కుమార్ యాదవ్, బీజేపీ నేత వంశీధర్‌రెడ్డి, జనసేన నేత వేములపాటి అజయ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కూటమి పార్టీల మధ్య విభేదాలు ఉన్నాయంటూ జరుగుతున్న ప్రచారంపై నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐకమత్యంతో పనిచేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని నిర్ణయించినట్లు తెలిపారు.

అభివృద్ధిని ప్రజలు గమనించాలి: ఎంపీ వేమిరెడ్డి

కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు గమనించాలని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మంత్రి నారాయణ పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి నగర అభివృద్ధికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేస్తున్నారని తెలిపారు. నగరంలో ఎక్కడ చూసినా ఎండ్‌టు ఎండ్ రోడ్లు, ఆధునిక పార్కులు, క్లోజ్డ్ డ్రైనేజీ వంటి అభివృద్ధి పనులు కనిపిస్తున్నాయని వివరించారు.

దేశంలోనే నంబర్‌వన్ నగరంగా నెల్లూరు: మంత్రి నారాయణ

నెల్లూరు నగరాన్ని దేశంలోనే నంబర్‌వన్ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వ హయాం నుంచి ప్రస్తుత కూటమి ప్రభుత్వం వరకు నగర అభివృద్ధి కొనసాగుతోందని చెప్పారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ కాలంలో జరిగిన పనులు, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధిని ప్రజలు బేరీజు వేసుకోవాలని సూచించారు.

అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు కొంతమేర మిగిలి ఉన్నప్పటికీ గత ప్రభుత్వం వాటిని పూర్తి చేయలేదని విమర్శించారు. 2027 జూన్ 12 నాటికి నగరంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి చేసి, దోమల సమస్యను తగ్గించేలా నెల్లూరును తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ఖజానాపై ఆర్థిక ఒత్తిడి ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడిగిన వెంటనే అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తున్నారని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు.

కుట్ర రాజకీయాలతో విజయాన్ని అడ్డుకోలేరు: ఎమ్మెల్యే కోటంరెడ్డి

నెల్లూరు రూరల్ పరిధిలోని 36 డివిజన్లలో ఎనిమిది డివిజన్లలో టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవమైనట్లు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. పలు ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకున్నారని, కొన్ని చోట్ల డమ్మీ అభ్యర్థులే మిగిలారని వ్యాఖ్యానించారు. ఓటమి భయంతో వైఎస్సార్‌సీపీ నేతలు కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

కూటమి పార్టీల మధ్య విభేదాలు ఉన్నాయంటూ అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని సూచించారు. ఎన్ని రాజకీయ ప్రయత్నాలు చేసినా ఎన్నికల్లో కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

సమష్టి కృషితో నగరాభివృద్ధి: ఎమ్మెల్సీ బీద

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు నగరం అనేక రంగాల్లో అభివృద్ధి చెందుతోందని ఎమ్మెల్సీ బీద రవిచంద్ర అన్నారు. కూటమి భాగస్వామ్య పార్టీల నేతలు సమష్టిగా పనిచేస్తున్నారని, అభివృద్ధి కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఐక్యంగా కృషి చేస్తున్నామని తెలిపారు.

కూటమి విజయంతోనే అభివృద్ధి: జనసేన నేత అజయ్

కూటమి పార్టీల అభ్యర్థుల విజయంతోనే నెల్లూరు అభివృద్ధి సాధ్యమవుతుందని జనసేన నేత వేములపాటి అజయ్ అన్నారు. అసత్య ప్రచారాలతో ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించడం సరికాదని విమర్శించారు. ప్రజలకు వాస్తవ పరిస్థితులను వివరించి, సమన్వయంతో ఎన్నికల్లో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

72 డివిజన్లలో కూటమి జెండా ఎగరాలి: బీజేపీ నేత వంశీధర్‌రెడ్డి

బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంశీధర్‌రెడ్డి సూచించారు. నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలోని మొత్తం 72 డివిజన్లలోనూ, మేయర్ పీఠంపైనా కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

కూటమి నేతల సమావేశం నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సమష్టి ప్రచారం, పరస్పర సమన్వయానికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు నేతలు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి :: పొదలకూరు ఎంపీటీసీ అభ్యర్థులకు విజ్ఞప్తి..

Key meetingallianceleadersNellore

About the author

Kadiyala Chinmaya Reddy

Kadiyala Chinmaya Reddy

Chief Editor

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

48 Posts

Latest News