31/10/2026, Saturday · 06:38:03 PM About UsPrivacy PolicyContact Us
Akshara Darshini

కన్నీటి పర్యంతమైన వాకాటి కుటుంబం....!

hameed 31/10/2026 4:46 PM శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 3

కన్నీటి పర్యంతమైన వాకాటి కుటుంబం....!
Want this news as a newspaper clip?Print News Clip
  • భార్యను గెలిపించాలని భర్త కన్నీటి వేడుకోలు..
  • ఎన్నికల వేళ పాత కేసుతో పోలీసుల నోటీసులు..
  • వేధింపులకు గురిచేస్తున్నారంటూ వాకాటి శ్రీనివాసులు రెడ్డి ఆవేదన
  • తనను అరెస్టు చేసినా.. తన భార్య సంధ్యను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి
  • మమ్మల్ని ఏడిపించిన వారికి మా కన్నీటి ఉసురు తప్పక తగులుతుంది
  • పొదలకూరు బిట్ - 3 ఎంపీటీసీ అభ్యర్థి వాకాటి సంధ్య

పొదలకూరు: ఎన్నికలకు మరికొద్ది రోజులే సమయం ఉండగా పొదలకూరు మండలంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. తమ కుటుంబాన్ని రాజకీయ కక్షతో పోలీసుల ద్వారా వేధిస్తున్నారంటూ వైసీపీ నాయకుడు వాకాటి శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. తనను అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ.. తన భార్య, పొదలకూరు బిట్‌-2 ఎంపీటీసీ అభ్యర్థి వాకాటి సంధ్యను గెలిపించాలని ఆయన ప్రజలను కన్నీటితో వేడుకున్నారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పొదలకూరు మండలంలో వైసీపీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయని, ముఖ్యంగా పొదలకూరు పట్టణంలోని నాలుగు ఎంపీటీసీ స్థానాల్లో వైసీపీ విజయం సాధించే అవకాశాలున్నాయన్న ఇంటెలిజెన్స్ సమాచారంతోనే తమ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని వాకాటి శ్రీనివాసులు రెడ్డి ఆరోపించారు.

2025లో నమోదైన రుస్తుం మైన్ కేసును ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చి పోలీసులు తనకు నోటీసులు జారీ చేశారని తెలిపారు. ఈరోజు సాయంత్రం ఐదు గంటల్లోగా డీఎస్పీ ఎదుట హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారని, తాను చట్టాన్ని గౌరవిస్తానని, తప్పకుండా హాజరవుతానని స్పష్టం చేశారు. రుస్తుం మైన్ వ్యవహారంలో తాను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని, తన బిడ్డల సాక్షిగా ప్రమాణం చేస్తున్నానంటూ భావోద్వేగానికి గురయ్యారు. రాజకీయంగా ఎదుర్కోలేక పాత కేసులను తెరపైకి తెచ్చి తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

నా పరిస్థితి ఏమైపోయినా.. నా భార్యను గెలిపించండి!

తనను అరెస్టు చేసినా సరే.. తన భార్య వాకాటి సంధ్యను ఎంపీటీసీగా గెలిపించి, తమ కుటుంబాన్ని వేధిస్తున్న వారికి ప్రజలు ఓటుతో సమాధానం చెప్పాలని వాకాటి శ్రీనివాసులు రెడ్డి కన్నీటితో విజ్ఞప్తి చేశారు. ఒకవైపు ఎన్నికల ప్రచారం.. మరోవైపు పోలీసుల నోటీసులతో తమ కుటుంబం తీవ్ర ఆందోళనకు గురవుతోందని తెలిపారు.

మా కన్నీటి ఉసురు తగులుతుంది..

పొదలకూరు బిట్‌-2 వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి వాకాటి సంధ్య సైతం కుటుంబానికి ఎదురైన పరిస్థితులను తలుచుకుని కన్నీటి పర్యంతమయ్యారు. అక్రమ కేసుల పేరుతో తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పైన భగవంతుడు ఉన్నాడని.. ఇక్కడ ప్రజలంతా జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నారని పేర్కొన్నారు. తమను ఏడిపిస్తున్న వారికి తమ కన్నీటి ఉసురు తప్పకుండా తగులుతుందని భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. ఎన్నికల వేళ వాకాటి కుటుంబం చేసిన ఈ ఆరోపణలు పొదలకూరు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

ఇవి కూడా చదవండి :: మడపల్లిలో జడ్పీటీసీ అభ్యర్థి రావి మల్లేశ్వరి ఎన్నికల ప్రచారం

కన్నీటి పర్యంతమైన వాకాటి కుటుంబం....!
కన్నీటి పర్యంతమైన వాకాటి కుటుంబం....!

Wakati familyTearful

About the author

hameed

hameed

Reporter

11 Posts

Latest News