బిరదవోలులో టీడీపీ ఎన్నికల ప్రచార హోరు..!

పొదలకూరు,(అక్షర దర్శిని):
పరిషత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పొదలకూరు మండలం బిరదవోలు ఎంపీటీసీ సెగ్మెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అన్నలూరు సుమలత ఆదివారం సాయంత్రం నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులతో కలిసి బిరదవోలు ఎస్సీ కాలనీలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ ఓటర్ల మద్దతు కోరారు. ప్రచారానికి స్థానిక ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా సుమలత మాట్లాడుతూ.. సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆశీస్సులతో ప్రజాసేవే లక్ష్యంగా ఎంపీటీసీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చానని తెలిపారు. బిరదవోలు సెగ్మెంట్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న తెలుగుదేశం పార్టీకి ప్రజలు అండగా నిలవాలని కోరారు. బిరదవోలు ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీలో ఉన్న తనను సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించడంతోపాటు, పొదలకూరు జడ్పీటీసీ అభ్యర్థి కలిచేటి ప్రభాకర్ రెడ్డిని సైతం ఆదరించి విజయాన్ని అందించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యంతో ముందుకు సాగుతామని, ప్రజలు అందించే ప్రతి ఓటు అభివృద్ధికి పునాది కావాలని సుమలత పేర్కొన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :: ఆదురుపల్లిలో పిడుగుపాటు.. స్వీట్ షాప్ గోడౌన్ చిమ్నీ ధ్వంసం
















