పోస్టల్ బ్యాలెట్‌ను సక్రమంగా వినియోగించుకోవాలి

- ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి కలెక్టర్ హిమాన్షు శుక్లా పిలుపు
నెల్లూరు,(అక్షర దర్శిని):
స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న అధికారులు, సిబ్బంది ఎన్నికల సంఘం నిబంధనలను పాటిస్తూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పిలుపునిచ్చారు. ప్రతి ఉద్యోగి తన ఓటు చెల్లుబాటు అయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.మంగళవారం నెల్లూరులోని శ్రీ వెంకటేశ్వర కస్తూర్బా కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ నందన్, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి నాగరాజకుమారి ఓటింగ్ ప్రక్రియను ఆయనకు వివరించారు. అనంతరం సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే విధానంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ సూచించారు. ఓటింగ్ సమయంలో ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్‌కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే ముందుగానే సంబంధిత అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని పేర్కొన్నారు.
ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల విధుల ఉత్తర్వుల ప్రతితో పాటు ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డును వెంట తీసుకురావాలని సూచించారు.నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో అక్టోబర్ 27, 28 తేదీల్లో, ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీల పరిధిలో అక్టోబర్ 27 నుంచి 29వ తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.ఈ కార్యక్రమంలో డీఈఓ బాలాజీరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కేశవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :: పొదలకూరు ఎంపీటీసీ అభ్యర్థులకు విజ్ఞప్తి..
















